పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు వృత్తాలుగా ఏర్పడి, ఒక బృందంగా పాటలు ఆలపిస్తారు. ఈ పాటలకు మూలాలు పురాణాల్లో, చరిత్రలో ఉంటాయి, ఆఖరికి ఒక నిర్దిష్టమైన ప్రాంతానికి సంబంధించిన తాజా రాజకీయ, సామాజిక పరిణామాల్లో కూడా ఉంటాయి. ఈ వేడుక సద్దుల బతుకమ్మతో పూర్తవుతుంది, ఆ రోజున పూల దొంతర్లను సమీపంలోని చెరువులు మరియు కొలనుల్లో నిమజ్జనం చేస్తారు.
బోనాలు ఒక హిందూ పండుగ, దీన్ని తెలుగు మాసమైన ఆషాఢంలో (ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం జూన్/జులై నెలల్లో వస్తుంది) చేసుకుంటారు, ఈ పండుగలో మహాంకాళి అమ్మవారిని పూజిస్తారు. భక్తుల కోరికలను నెరవేర్చినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకొంటూ చేసే పండుగ ఇది.
ఈ పండుగలో భాగంగా, భోజనం లేదా ఆహారాన్ని ప్రధాన దేవత అయిన జగన్మాతకు సమర్పిస్తారు. మహిళలు పాలు, బెల్లంతో బియ్యాన్ని ఇత్తడి లేదా మట్టి కుండలో వండి, దాన్ని వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరించి, ఆ ఘటం పై భాగంలో వెలిగే దీపాన్ని పెడతారు.
పండుగలో ఒక ముఖ్యమైన భాగం రంగం (భవిష్య వాణి). మహిళలు ఒక మట్టి కుండ మీద నిలబడి, మహాంకాళి దేవతను తనపై ‘ఆవాహన’ చేసుకొని, భవిష్య వాణిని వినిపిస్తారు.
తరువాత కార్యక్రమం ఘటం. ఒక ఇత్తడి కుండను జగన్మాత రూపంలో అలంకరిస్తారు. ఆ ఘటాన్ని ఒక పూజారి మోస్తూ నడుస్తారు, ఆయన వెంట ‘పోతురాజులు’ వెంట వెళ్తారు, బాకాలూ, భేరీలు లాంటి సంగీత వాయిద్య ఘోషలతో నిమజ్జనానికి ఊరేగింపు సాగుతుంది. పోతురాజులను జగన్మాత సోదరుడిగా పరిగణిస్తారు, వారు భారీ శరీరాలతో, శరీరం పైభాగాన ఎలాంచి ఆచ్ఛాదనా లేకుండా, చిన్న బిగుతైన ఎర్రటి ధోతీని చుట్టుకొని, మోకాళ్ళకు గంటలు కట్టుకొని, ఒళ్ళంతా పసుపు, నుదుటికి కుంకుమ పూసుకొని భీకరంగా ఉంటారు.
ముస్లింలకు రంజాన్ ప్రధాన పండుగ అయినప్పటికీ, మొహర్రంను కూడా తెలంగాణలో భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఇది ‘పీర్ల పండుగ’గా ప్రసిద్ధి చెందింది. పీర్ అంటే గురువు అని అర్థం. పలువురు హిందువులు ఈ పండుగలో పాలుపంచుకుంటారు.
ప్రధానంగా హైదరాబాద్‌లో, ఆ చుట్టుపక్కలా ఉండే క్రైస్తవులు క్రిస్మస్, గుడ్ ఫ్రైడేలను గొప్ప ఉత్సాహంతో, ఆధ్యాత్మిక భావనతో జరుపుకొంటారు.
కళలు మరియు కళాకృతులు
తెలంగాణ కళలకూ, కళాకృతులకూ ఒక గొప్ప కేంద్రం, అద్భుతమైన అనేక హస్తకళలు ఇక్కడ ఉన్నాయి.
బిద్రీ కళ
లోహం మీద వెండిని చెక్కే అపూర్వమైన కళ. నలుపు, బంగారం, వెండి పూతలను దీని మీద వేస్తారు. పోత పోయడం, చెక్కడం, పొదగడం, ఆక్సీకరణ లాంటి వివిధ దశలు దీనిలో ఉంటాయి. పూర్వం హైదరాబాద్ రాష్ట్రంలో (ప్రస్తుతం కర్ణాటకలో భాగం) ఉన్న బీదర్ అనే పట్టణం పేరు ఈ కళా రూపానికి వచ్చింది.
బంజారా నీడిల్ క్రాఫ్ట్స్
బంజారా నీడిల్ క్రాఫ్ట్స్ తెలంగాణలోని బంజారాలు (సంచార గిరిజనులు) చేతులతో తయారు చేసిన సంప్రదాయ వస్త్రాలు. నీడిల్ క్రాఫ్ట్‌ను వస్త్రం మీద కుట్టే ఒక రకమైన ఎంబ్రాయిడరీ, అద్దాల పనితనం ఇది.
డ్వాక్రా మెటల్ క్రాఫ్ట్స్
కంచుతో చేసిన కళాకృతులను ఢోక్రా అంటారు, ఇవి ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం, ఉషేగావ్, చిత్తోల్‌బోరిలో విస్తృతంగా కనిపిస్తాయి. ఈ గిరిజన హస్త కళతో బొమ్మలు, గిరిజన దేవతలు లాంటి వస్తువులను తయారు చేస్తారు. ఈ వస్తువులలో జానపద గాథలు, నెమళ్ళు, ఏనుగులు, గుర్రాలు, కొలత గిన్నె, దీపాల పెట్టెలు, ఇతర సరళమైన కళారూపాలు, సంప్రదాయిక డిజైన్లు ఉంటాయి.
నిర్మల్ కళారూపాలు
సుప్రసిద్ధమైన నిర్మల్ తైల వర్ణ చిత్రాలలో రామాయణ, మహాభారతాల్లోంచి ఇతిహాసాల్లోని కథలను చిత్రించడం కోసం సహజసిద్ధమైన రంగులు ఉపయోగిస్తారు. అలాగే, చెక్కలపై వేసిన పెయింటింగ్స్, ఇతర కర్ర వస్తువులు గొప్ప సౌందర్య వ్యక్తీకరణను కలిగి ఉంటాయి. నిర్మల్ కళకు మూలాలు కాకతీయుల యుగంలో లభిస్తాయి. నిర్మల్ కళాకృతుల కోసం ఉపయోగించిన నమూనాల్లో అంజంతా, ఎల్లోరా ప్రాంతాలకు చెందిన పూల డిజైన్లు మరియు కుడ్యచిత్రాలు, మొఘల్ మీనియేచర్లు ఉన్నాయి.
ఇత్తడి పోత వస్తువులు
కాంస్యంతో చేసిన అద్భుతమైన పోత వస్తువులకు తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. విగ్రహాల పోత కోసం ఘనమైన పోతను ఉపయోగించేటప్పుడు, పూర్తి చేసిన ఒక మైనపు నమూనా మీద వివిధ రకాల మచచి పూతలు అనేకం వినియోగించి, అచ్చులను తయారు చేస్తారు. పోతపోసిన బొమ్మలో చక్కటి వంపులు వచ్చేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది.